14/10/2026
ప్రకృతి పూల పండుగ.. బతుకమ్మ
- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక: సైబరాబాద్ సీపీ డా.యం. రమేష్
ప్రకృతికి, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిలయమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా . యం. రమేష్ పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మకు తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందన్నారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో సీపీ రమేష్ పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటలాడుతూ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని, మహిళల ఐక్యతను చాటిచెప్పే బతుకమ్మ పండుగ తరతరాలుగా వస్తున్న మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, క్రైమ్ డీసీపీ పుష్ప, కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్, ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిణి రెడ్డి, షీ టీమ్స్ డీసీపీ సృజన, హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, ఏవో జ్యోతిర్మయి మరియు పోలీసు అధికారులు, కమిషనరేట్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.